V6 News

ట్రంప్ ఈవెంట్లో కాల్పులు ఒక డ్రామా.. సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ వైరల్

ట్రంప్ ఈవెంట్లో కాల్పులు ఒక డ్రామా.. సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ వైరల్
  • సోషల్ మీడియా పోస్టులు, మీమ్స్
  • ట్రెండింగ్​లో స్టేజ్డ్, ఫాల్స్ ఫ్లాగ్ అనే పదాలు 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న  డిన్నర్ పార్టీలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. కాలిఫోర్నియాకు చెందిన కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించి కాల్పులు జరపడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపగా.. నెటిజన్లు మాత్రం ఇదంతా అమెరికా ప్రభుత్వం కావాలని చేసిన డ్రామ అని అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే  సోషల్ మీడియాలో  ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ పోస్టులు, మీమ్స్ వెల్లువెత్తాయి. ట్రంప్ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఫాల్స్ ఫ్లాగ్ (తానే తప్పు చేసి.. ఆ తప్పును పక్కవాడిపై నెట్టడం)కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ముఖ్యంగా ఎక్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో ‘స్టేజ్డ్, ఫాల్స్ ఫ్లాగ్’ అనే పదాలు ట్రెండ్ అవుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికే 3 లక్షలకు పైగా పోస్ట్‌‌‌‌‌‌‌‌లు ఈ ఘటనను ఒక డ్రామాగానే పేర్కొన్నాయి. వైట్ హౌస్‌‌‌‌‌‌‌‌లో కొత్త బాల్‌‌‌‌‌‌‌‌రూమ్ నిర్మాణానికి ప్రజల మద్దతు పొందేందుకే ట్రంప్ ఈ నాటకానికి తెరలేపారని కొందరు సోషల్ మీడియాలో వాదించగా.. దానికి ఏకంగా 90 లక్షల వ్యూస్ వచ్చాయి.

విందుకు ముందు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘షాట్స్ విల్ బి ఫైర్డ్ (తుపాకులు పేలుతాయి)’ అని వ్యాఖ్యానించడం, ఫాక్స్ న్యూస్ లైవ్ మధ్యలోనే కట్ అవ్వడం వంటి అంశాలను తమ వాదనకు సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. అలాగే.. రష్యా, ఇరాన్ మీడియా ప్రతినిధులు  ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. అయితే, ఈ ప్రచారాలన్నింటినీ అమెరికా భద్రతా అధికారులు తీవ్రంగా ఖండించారు.